సలీమ్`జావేద్.. 1971లో మొదలైన ఈ రచయితల ద్వయం ప్రస్థానం 1987 వరకు దిగ్విజయంగా కొనసాగింది. ఒక విధంగా బాలీవుడ్ సినిమాల తీరు తెన్నులను మార్చింది వీరిద్దరే అని చెప్పాలి. షోలే, యాదోంకి బారాత్, డాన్, క్రాంతి, దీవార్, దోస్తానా, మిస్టర్ ఇండియా.. వంటి చరిత్ర సృష్టించిన సినిమాలకు కథలు అందించింది వీరిద్దరే. వారి కెరీర్‌లో చేసిన సినిమాల్లో ఇవి కొన్ని మాత్రమే. ఆ తర్వాత సలీమ్ నుంచి విడిపోయిన జావేద్ ఆ తర్వాత బేతాబ్, డకాయిట్, మేరి జంగ్, అర్జున్ వంటి బ్లాక్‌బస్టర్స్‌కి కథలు సమకూర్చారు. సలీమ్, జావేద్ కలయికలో వచ్చినన్ని సూపర్‌హిట్ సినిమాలు మరే ఇతర రచయితల కెరీర్‌లో లేవంటే అతిశయోక్తి కాదు. కథా రచయితగానే కాదు, గేయ రచయితగా కూడా ఎన్నో సినిమాలు చేశారు జావేద్. గత సంవత్సరం వరకు ఎన్నో సూపర్‌హిట్ పాటలకు సాహిత్యాన్ని అందించారు. 79 ఏళ్ళ జావేద్ తన జీవితంలోని కొన్ని విశేషాల గురించి, కొన్ని వ్యసనాల వల్ల కోల్పోయిన జీవితం గురించి ఒక సందర్భంలో వివరించారు.
‘ఒకప్పుడు నేను మద్యానికి విపరీతంగా బానిసనైపోయాను. మందులో ఏముందోగానీ అది తాగగానే నేను రాక్షసుడిలా అయిపోతాను. విపరీతమైన కోపం వస్తుంది. నా కెరీర్ ప్రారంభంలోనే 10 సంవత్సరాలు మందు మత్తులోనే బ్రతికాను. మందు తాగితే నా అంత ప్రమాదకారి మరొకరు ఉండరు అనిపిస్తుంది. అయితే ఇదంతా ఒకప్పుడు ఉండేది. 1991 జూలై 31న చివరిసారిగా తాగాను. ఆరోజు నుంచి ఇప్పటివరకు మళ్ళీ మందు జోలికి వెళ్ళలేదు. మద్యం వల్ల చిన్న వయసులోనే నా జీవితం నాశనం అయిపోయింది. వృధా అయిపోయిన ఆ పదేళ్ళలో ఎంతో చేసి ఉండొచ్చు. కానీ, అలా జరగలేదు. ప్రస్తుతం సొసైటీలో పార్టీ కల్చర్ విపరీతంగా నడుస్తోంది. అది అంత మంచిది కాదు. నా స్వానుభవంతో యువతకు చెబుతున్నాను. మీ జీవితంలో ఎంతో విలువైన యుక్త వయసును మద్యం మత్తులో ఉంచకండి’ అంటూ యువతకు తన సందేశాన్ని అందించారు జావేద్ అక్తర్.